Tuesday, April 27, 2010

నన్నిడిసిపెట్టెల్లినాడే! మొన్న తిరిగోస్తానన్నాడే!!

నన్నిడిసిపెట్టెల్లినాడే,
నా రాజు....
మొన్న తిరిగోస్తాననాడే నా రాజు!
నీలు తేబోతుంటే, నీ తోడే... వోలమ్మ!

నాయేంట ఎవరోను నడిసినట్టుంతాదే!
నన్నిడిసిపెట్టెల్లినాడే,
నా రాజు....

అద్దములో సూత్తుంటే అది ఎటో సిగ్గమ్మా!
నా ఎనక ఎవరోను నవ్వినట్టునతాదే
నన్నిడిసిపెట్టెల్లినాడే,
నా రాజు....

నల్లని ఎన్నెట్లో సాపేసి కూకుంటే
ఒట్టమ్మా... ఒల్లంతా ఉలికులికి పడతాదే!
నన్నిడిసిపెట్టెల్లినాడే,
నా రాజు....

నీతయినవోడే నారాతెట్టగుండాదో!
కల్లల్లో సత్తేముగా కట్టినట్టుండాడే!
నన్నిడిసిపెట్టెల్లినాడే,
నా రాజు....
మొన్న తిరిగోస్తానన్నాడే!!






Wednesday, April 7, 2010

రా వోద్దె!

రా వోద్దె నాపక్క రావోద్దె యెంకీ!
ఆ పొద్దే మన పోద్దులయిపోయే నెంకీ!!
నీ మీద పాణాలు నిలుపుకొంటా వచ్చి,
అద్ద రేతిరిలోన అడవంత తిరిగానే!!

రా వోద్దె నాపక్క రావోద్దె యెంకీ!
ఆ పొద్దే మన పోద్దులయిపోయే నెంకీ!!
గట్టెక్కి సూసాను! పుట్టేక్కి సూసానే!!
కల్ల కపటము లేని పిల్లవనుకొన్నానే!!
 
రా వోద్దె నాపక్క రావోద్దె యెంకీ!
ఆ పొద్దే మన పోద్దులయిపోయే నెంకీ!!
ఏడ నువ్వుండావో ఏళ్ళన్నీ ఈదానే!
ఏటి సేస్తుండావో ఈశ్శరున్ని గానే!!
 
రా వోద్దె నాపక్క రావోద్దె యెంకీ!
ఆ పొద్దే మన పోద్దులయిపోయే నెంకీ!!

Monday, April 5, 2010

యేటిదరి నాయెంకి

ఈ రేతి రొక్క తేవు యే మోచ్చినావే?
ఆడు నేనిక్కడే ఆడినామామ్మా!


ఏటి నురగల కేటి ఏటి సూసావే?
మాఓడి మనసటే మరుగుతాదమ్మా!


సెంద్ర వొంకలో యే సిత్రమున్నాదే?
వొంక పోగానే మా వాడొస్తాడమ్మా!


ఆడు నేనిక్కడే ఆడినామామ్మా!
మాఓడి మనసటే మరుగుతాదమ్మా!

ఆ పొద్దే మన పొత్తు అయిపోయేనెంకీ!

Wednesday, February 17, 2010

నీ తోనే ఉంటాను

"నీ తోనే ఉంటాను నాయుడు బావా!..
నీ మాటే యింటాను నాయుడు బావా!!.."

'సరకులేమి కావాలె సంతన పిల్లా?'

'నువ్వు మరమమిడిసి మనసియ్యి నాయుడు బావా!'
'సక్కదనమునకేమిత్తు సంతన పిల్లా..'
'నువ్వు సల్లంగుండు పద్దాక నాయుడు బావా!'


'యేడనే నీ కాపురమో యెల్తురు పిల్లా?..'
'నీ నీడలోన మేడ కడతా నాయుడు బావా!'


"నీ తోనే ఉంటాను నాయుడు బావా!..
నీ మాటే యింటాను నాయుడు బావా!!.."

Monday, February 15, 2010

ఎంకితో తీర్థానికెల్లాలి

ఎంకితో తీర్థానికెల్లాలి
సంకలో పిల్లోడు సంబ్రాలుపడుతుంటే!

ఎంకితో తీర్థానికెల్లాలి,
నెత్తి మూటలనెత్తుకోవాలి!
కొత్తమడతల దీసికట్టాలి!
ఆడందారుల ఎంట నడవాలి!
బరువు మారుసుకొంట ఫక్కున నవ్వాలి!

ఎంకితో తీర్థానికెల్లాలి!
సంకలో పిల్లోడు సంబ్రాలుపడుతుంటే!

తాతానాటి ఊసు తలవాలి!
దారిపొడుగునా కీసులాడాలి!
'తప్పునీదే' యంటా దెప్పాలి !
దైవమున్నాడని ధడిపించుకోవాలి!

ఎంకితో తీర్థానికెల్లాలి!
సంకలో పిల్లోడు సంబ్రాలుపడుతుంటే!

ఎంకితో తీర్థానికెల్లాలి!
కతకాడ కూసింత నిలవాలి!
కతగాడు మావూసే సెప్పాలి!
నను సూసి పిల్లోడు నవ్వాలి!
మాలోనమామేటో మతులిరుసుకోవాలి!

ఎంకితో తీర్థానికెల్లాలి!
సంకలో పిల్లోడు సంబ్రాలుపడుతుంటే!

ఎంకితో  తీర్థానికెల్లాలి!
కోనేటిలో తానమాడాలి!
గుడిసుట్టు ముమ్మారు తిరగాలి!
కోపాలు తాపాలు మానాలి!
ఇద్దరమూ పిల్లోన్ని ఈసుడికిసూపాలి!

ఎంకితో తీర్థానికెల్లాలి!
సంకలో పిల్లోడు సంబ్రాలుపడుతుంటే!

ఎంకితో తీర్థానికెల్లాలి!

Sunday, December 6, 2009

దూరాన ఎంకి

యాడుంటివే ఎంకి! యాడుంటివే??
పూతోరి పందిట్లో సీతాయి యెలుతుంటే!
నీ తళుకు గేపగాన నా తల తిరిగిందోలె!
యాడుంటివే ఎంకి! యాడుంటివే??

మామిడీ తోటకెళ్ళి, మంచి పండంటి కోసి!
ఎటో గానీ నోట్లోస్తే, ఇసమయి పోయిందిలే!!
యాడుంటివే ఎంకి! యాడుంటివే??
 

పోత్తేల్ల జొన్న సేలో, సిత్తరమయి పోతాది..
గమ్మేనా వోన వస్తే గుండిగిరి పోయేనోలె!!
యాడుంటివే ఎంకి! యాడుంటివే??

Saturday, March 22, 2008

యెంకితో తిరపతి

యెంకీ నా తోటి రాయే
మన ఎంకటేస్మరుణ్ణి ఎల్లి సూసొద్దాము

ఆవుదూడల్ని
అత్తోరికాడుంచి
మూటముల్లే గట్టి
ముసలోల్లతో సెప్పి యెంకీ నా తోటి రాయే...

ఆ సామి మీదేటో
ఊసులాడుకొంటా
కొండ మెట్లన్నీ నీ
కొంగెట్టుకెక్కాలి యెంకీ నా తోటి రాయే...

'రేతిరి పగటేల
రెప్పయ్య కెంకీని
సల్లంగ సూడ ' మని
సామితో జెప్పాలి యెంకీ నా తోటి రాయే...